గుంటూరు: ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారన్న క్రమంలో ఆయన భార్య విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తతో పాటు మరో 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆమె హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Continues below advertisement

ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతల సమస్య నెలకొందని, పోలీసుల తీరు వల్ల తమ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. తమకు 24 గంటల పాటు నిరంతర భద్రత కల్పించాలని ఆమె కోర్టును కోరారు. ఈ విషయంలో కోర్టు తక్షణం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విన్నవించారు.

హౌస్ మోషన్ పిటిషన్ అంటే ఏమిటి?: అత్యవసర పరిస్థితుల్లో, కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత లేదా సెలవు దినాల్లో అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ వేసే పిటిషన్‌ను హౌస్ మోషన్ పిటిషన్ అంటారు. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద పోలీసుల మోహరించారు. ఆయనను అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళనల మధ్య ఈ పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్రమ నిర్బంధం (Illegal Detention) రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించే అవకాశం కనిపిస్తోంది. 

Continues below advertisement

అంబటి నివాసంపై కోడిగుడ్లు, రాళ్లు, సీసాలతో దాడి

అమరావతిలోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద పరిస్తితి అదుపుతప్పుతోంది. పోలీసులు అంబటిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, అక్కడకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇంటిపైకి రాళ్లు, సీసాలు, కోడిగుడ్లు విసిరారు.

దీంతో అంబటి మద్దతుదారులు, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ, దాడులు జరగడం అక్కడ తీవ్ర కలకలం రేపుతోంది.