Sajjala On Pawan Kalyan : వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమనే మాటకే కట్టుబడి ఉన్నానని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవనివ్వమని ఆదివారం సత్తెనపల్లిలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ గతంలో కూడా వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్నారని గుర్తుచేశారు. ఎన్నికల ఫలితాలు ప్రజలు నిర్ణయిస్తారని, నాయకుల చేతుల్లో ఏం ఉండదన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా చూసేది పవన్, చంద్రబాబు కాదు రైతులు, వృద్ధులు, మహిళలు, డ్వాక్రా మహిళలు వద్దనుకుంటే అప్పుడు జగన్ ను అధికారంలోకి రాకుండా ఆపగలుగుతారన్నారు.
పాలన బాగుంటేనే ఓట్లు అడుగుతాం
"జగన్ కూడా నేను చేసిన పాలన బాగుంటేనే వైసీపీ ఓట్లు వేయమని అడుగుతున్నారు. వైసీపీ రాకుండా చూసేదే పవన్ బాధ్యతా? ఏం లేకుండా పవన్ ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే స్క్రిప్ట్ ఎక్కడ తయారు అయిందో చూడొచ్చు. ఒక్కోసారి పవన్ ఒక్కోలాగా మాట్లాడుతున్నారు. కానీ టీడీపీని మాత్రం ఒక్క మాట అనడం లేదు. ఒకేసారి లక్ష సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ సృష్టించారు సీఎం జగన్. పవన్ ను రోజు రావొద్దని ఎవరు చెప్పారు. కేఏ పాల్ కూడా రావొచ్చు.కానీ వచ్చి ప్రజలకు ఏమి చేస్తారో చెప్పాలి. వారానికి ఎన్ని రోజులు ఉంటారు అనేది ప్రశ్నకాదు వచ్చి ఏంచేస్తారు అనేదే ప్రశ్న" - సజ్జల రామకృష్ణా రెడ్డి
పవన్ సీరియస్ పొలిటీషియన్ కాదు
చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ను పవన్ కల్యాణ్ చదువుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అజ్ఞానంతో మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు ఏజెంట్‌గా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదన్నారు. పవన్ ఆలోచన ఎప్పుడూ టీడీపీ, చంద్రబాబు గురించే అని విమర్శించారు. టీడీపీ హయాంలో ప్రజలకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా? అని సజ్జల ప్రశ్నించారు. మాచర్లలో అల్లర్లకు కారణం చంద్రబాబే అన్నారు. మాచర్లలో చంద్రబాబు నిజ స్వరూపం బయటపడిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 62 లక్షల మందికిపైగా పింఛన్లు అందించామన్నారు. కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలకు రూ.26 వేల కోట్ల లబ్ధి చేకూరిందని సజ్జల స్పష్టం చేశారు.
నాలుగు ఊర్లు తిరిగి విమర్శలు చేయడం కాదు
"కౌలు రైతులే కాదు ఏ రైతులైనా ఆత్మహత్యలు చేసుకోకుండా ఒక క్యాలెండర్ పెట్టుకుని వాళ్లు ఏ విధంగా సాయం అందాలో అందిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా కచ్చితంగా ఉంది. ప్రభుత్వం విస్మరించిన వల్లనో, ఇతర కారణాల వల్లనో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ప్రతిపక్షాలు చెప్పాలి. ఏదో నాలుగు ఊర్లు తిరిగి వచ్చి ప్రభుత్వం విమర్శలు చేయకూడదు. పవన్ సీరియస్ పొలిటీషియన్ అయితే రాష్ట్రంలో సమస్యలు తెలుసుకోవాలి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని సమస్య పరిష్కరించేలా ప్రయత్నం చేయాలి. ఇది ప్రజాస్వామ్యం కేఏ పాల్, పవన్ ఎవరైనా రావొచ్చు. సీఎం జగన్ చేసే పనులు ప్రజలకు నచ్చుతున్నాయ్ కాబట్టి వైసీపీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది వైసీపీ ప్రభుత్వం. అన్నింటిలో 50 శాతం కన్నా ఎక్కువ పదవులు కేటాయించారు సీఎం జగన్." -సజ్జల