Voter ID Corrections : ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలు అమలుకానున్నాయని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కీలక మార్పులు చేసిందన్నారు. ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించారని, ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి ఓటరు మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని మీనా తెలిపారు. జాబితాలో పేరు తొలగింపునకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధృవీకరణ పత్రాన్ని జతచేయవలసి ఉంటుందన్నారు. ఫారం-8 విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఇప్పటి వరకు దీనిని ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణ కోసం వినియోగిస్తుండగా, ఇకపై దానిని విభిన్న అంశాలకు వినియోగించనున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలోనే కాక, ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం-8 వినియోగించనున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 


ఓటర్ల జాబితా నుంచి తొలగించం 


నూతన చట్ట సవరణలు అనుగుణంగా ఓటర్లు 2023 ఏప్రిల్ నాటికి తమ ఆధార్ నంబర్ ఓటర్ ఐడీతో జత చేయాలని ఎస్ఈసీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఆధార్ నంబర్ ను సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించరని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటర్లుగా నమెదైన వారి ఆధార్ నంబర్ కోసం కొత్తగా ఫారమ్ 6B ప్రవేశపెట్టామన్నారు. ఈసీఐ, ఇరోనెట్, గరుడ, ఎన్వీఎస్పీ, వీహెచ్ఏ వెబ్ సైట్లలో ఈ నెలాఖరు నాటికి నూతన ధరఖాస్తులు అందుబాటులో ఉంటుందన్నారు. 6B దరఖాస్తును ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఎన్నికల సంఘానిరి సమర్పించవచ్చన్నారు. ఎన్వీఎస్పీ, ఓటర్ల హెల్ప్ లైన్ యాప్ అనుసరించి యుఐడీఐఎతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఓటీపీని ఉపయోగించి ఆధార్ నంబర్ సెల్ఫ్ అసెస్మెంట్ చేయవచ్చారు. 


ఆధార నంబర్ జత చేయడం స్వచ్ఛందం 


మరోవైపు బూత్ లెవల్ అధికారి ఓటర్ల నుంచి ఆధార్ నంబర్ సేకరించడానికి ఇంటింటిని సందర్శించటంతో పాటు ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని మీనా పేర్కొన్నారు. ఆధార్ సంఖ్యను అందించడం పూర్తిగా స్వచ్ఛందమని, ఓటర్లు ఆధార్ నంబర్ ను అందించలేకపోతే  ఫారం-6బిలో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించాలన్నారు. ఆధార్ నంబర్ సేకరణ, నిర్వహణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని బహిర్గతం చేయమని  ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సేకరించిన హార్డ్ కాపీలు సురక్షితంగా ఉంచుతామన్నారు. యుఐడీఏఐ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్  నియమించిన లైసెన్స్ పొందిన ఆధార్ వాల్ట్ లో ఓటర్ల ఆధార్ నంబర్లను జాగ్రత్త చేస్తామని మీనా స్పష్టం చేశారు.