Draupadi Murmu AP Tour : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌప‌ది ముర్ము ఏపీలో పర్యటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు బీజేపీ నేతలు సాదరంగా స్వాగ‌తం ప‌లికారు. ప్రజా ప్రతినిధులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయ‌కులు ముర్మును ఆహ్వానించారు. గిరిజ‌న నృత్యాల‌తో రాష్ట్రప‌తి అభ్యర్థి ముర్ముకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అనంత‌రం ఆమె సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం జ‌గ‌న్ స‌తీస‌మేతంగా ద్రౌపది ముర్ముకు ఆహ్వానం ప‌లికారు. సీఎం స‌మ‌క్షంలో దుర్గమ్మ ఆల‌య అర్చకులు ఆమెకు వేదాశీర్వచ‌నం అందించారు. 






ద్రౌపది ముర్ముకే వైసీపీ మద్దతు 


ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  మంగళగిరి సీకే కన్వెన్షన్‌ హాల్ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం దక్కిందన్నారు. వైసీపీ మొదటి నుంచి సామాజిక న్యాయం కోసం పాటుపడుతుందన్నారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చేసి చూపించిన ప్రభుత్వం వైసీపీ అని సీఎం జగన్ అన్నారు. అందరూ ముర్ముకే ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు.  



వారసత్వ కట్టడాలకు ఏపీ నిలయం 


ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్న ద్రౌపది ముర్ము సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో వైసీపీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ద్రౌపది ముర్ము తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. వారసత్వ కట్టడాలకు ఏపీ నిలయమని ద్రౌపది ముర్ము అన్నారు. ఏపీకి ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై పుట్టారన్నారు. తెలుగు కవులు నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడలను ద్రౌపది ముర్ము స్మరించుకున్నారు. తిరుపతి, లేపాక్షి వంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు ఏపీ నిలయమన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో తెలుగు వారు ఎందరో ప్రాణాలు అర్పించారన్నారు. ఏపీలో ప్రకృతి సహజ సిద్ధమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆమె కోరారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ద్రౌపది ముర్ము భేటీ అయ్యారు.  విజయవాడలోని ఓ హోటల్లో ఈ సమావేశం జరిగింది.