Minister Peddireddy on Red Sandals : ఎర్రచందనం అక్రమ రవాణాపై  రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం సమీక్షించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైతే పక్క రాష్ట్రాల సహకారాన్ని కూడా తీసుకోవాలని సూచించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం కూడా త్వరలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు అనుమతి కోరామని తెలిపారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు త్వరలోనే సరిహద్దు రాష్ట్రాల అటవీ, పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 


స్మగ్లర్ల కదలికలపై నిఘా 


రాష్ట్ర సచివాలయంలో అటవీ, పోలీసు శాఖ అధికారులతో ఎర్రచందనంపై సమీక్షించిన ఆయన.. సరిహద్దు రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు చేస్తున్నారన్నారు. ఈ విషయంపై కర్ణాటక, తమిళనాడు పోలీసు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో స్మగ్లర్ల సమాచారాన్ని పంచుకోవాలన్నారు. స్మగ్లర్ల కదలికలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. 


 5,376.43 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వలు


ఆంధ్రప్రదేశ్ 5.30 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎర్రచందనం నిల్వలు స్మగ్లర్ల బారిన పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు టెక్నాలజీ వినియోగించుకోవాలన్నారు. ఎర్రచందనంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో కూంబింగ్‌ను ముమ్మరం చేస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, కఠిన శిక్షలు పడేలా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 5,376.43 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం సీజ్ చేశామన్నారు. వీటిని అమ్మేందుకు సీఐటీఈఎస్ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి కోరామన్నారు. అనుమతులు వచ్చిన తరువాత ఈ నిల్వలను విక్రయిస్తామన్నారు. దీంతో రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఈ ఆదాయంలో 30 శాతం వరకు ఎర్రచందనం కన్జర్వేషన్‌కు వినియోగించుకోవచ్చని అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 


డిస్కంలపై సమీక్ష 


సచివాలయంలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షించారు. డిస్కం సీఎండీలు డివిజన్ స్థాయిలో పర్యటించాలని మంత్రి సూచించారు. గ్రౌండ్ లెవల్ లో విద్యుత్ వినియోగం, సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. డిస్కంల పనితీరును మరింత మెరుగుపరచాలన్నారు. రైతులకు విద్యుత్ ను ఇచ్చే ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోతే తక్షణం స్పందించాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్ లు రీప్లేస్ చేసే సందర్భంలో అధిక జాప్యం వల్ల రైతులు పంటనష్ట పోతారన్నారు. వారం రోజుల్లో కాలిపోయిన వాటి స్థానంలో పనిచేసేవి ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ ఫార్మర్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.