Minister Botsa On GO No 1 : జీవో నెం1 ను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. అందులో రోడ్‌షోలు, ర్యాలీల ప్రస్తావన లేదన్నారు. వాటిని ఎక్కడా నిషేధించలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం జీవో నెం:1 జారీ చేస్తే, దానిపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోందన్నారు మంత్రి బొత్స.  అది తనను అడ్డుకోవడానికే అని విపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తుండగా, ఆయనకు వత్తాసు పలుకుతున్న పార్టీలపై విరుచుకుపడ్డారు. ప్రజలను కాపాడడం ప్రభుత్వ కనీస బాధ్యతని,అందులో భాగంగానే జీవో జారీ చేస్తే, చంద్రబాబు తనను అణగదొక్కడానికే అని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. జీవోలో ఏముంది అన్నది ఒక్కసారి చంద్రబాబు చదవాలన్నారు. ఎక్కడా రోడ్ల మీద తిరగొద్దని, ర్యాలీలు నిర్వహించొద్దని, రోడ్‌షోలు వద్దని జీవోలో లేదన్నారు. రహదారులు, వాటి పక్కల మార్జిన్లలో బహిరంగ సభలు, సమావేశాలు నిషేధిస్తూ జీవో జారీ చేశారని వివరించారు.


కక్ష సాధింపు కాదు 


చంద్రబాబుతో పాటు, ఆయనకు మద్దతు ఇస్తున్న పార్టీలు జీవో నెం 1 పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, దాన్ని చీకటి జీవో అని అభివర్ణించటాన్ని తప్పుబట్టారు మంత్రి బొత్స. చంద్రబాబు కారణంగా 11 మంది బలయితే మరొకరు బలికాకూడదనే ఉద్దేశంతోనే జీవోను జారీ చేశామన్నారు. ప్రజలను కాపాడడానికి, వారికి భద్రత కల్పించడం కోసమే జీవో జారీ చేశారు తప్పా, ఎవరిపైనా కక్ష సాధింపు కాదని వివరించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మున్సిపల్‌ రోడ్లు, పంచాయతీ రోడ్లు ఏవైనా ప్రజల రాకపోకలు, వాహనాలు రాకపోకలు, సరుకుల రవాణా కోసం వినియోగిస్తారన్నారు.  ఆ ప్రాంతాల్లో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తే రవాణాపై ప్రభావం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఇరుకైన రోడ్ల మీద సభల వల్ల ప్రజల ప్రాణాలకు హాని కూడా కలుగుతోందని గుర్తించి నిర్ణయం తీసుకున్నామని, కందుకూరులో జరిగింది కూడా అదేనని అన్నారు.


నాడు చంద్రబాబు ఆంక్షలు విధించలేదా 


చంద్రబాబు చీకటి జీవో అంటుంటే, మరొకరు బ్రిటిషర్లు తెచ్చిన పోలీస్‌ చట్టం అంటున్నారని, కానీ నిజం చెప్పాలంటే ఇవాళ దేశంలో అమలవుతున్న చట్టాలన్నీ పాతవే అన్న విషయాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. కొత్తగా రూపొందించినవి లేవన్నారు.  2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కూడా అవే చట్టాల ద్వారా ఆంక్షలు అమలు చేశారని, 2014–19 మధ్య తూర్పు గోదావరిలో ఇదే పోలీస్‌ చట్టంలోని సెక్షన్‌–30, 31ని చంద్రబాబు మూడేళ్లు నిర్బంధంగా అమలుచేశారని,  ఆనాడు ఎందుకు తప్పు పట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇవాళ  జీవో నెం:1ని తీవ్రంగా తప్పు పడుతుంటే,మరి కొన్ని పార్టీల కూడా అదే బాటలో విమర్శించటం ఏంటని నిలదీశారు.


వీటికి సమాధానం చెప్పగలరా?-..మాజీ మంత్రి కన్నబాబు


చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక బలమైన కారణం కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తే, ఏ చట్ట ప్రకారం ఆయనను నియంత్రించారని మాజీ మంత్రి కన్నబాబు నిలదీశారు. ఆయనను పరామర్శించడానికి చిరంజీవి వస్తే, ఆయన్ను కూడా ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలన్నారు. విశాఖలో జగన్‌ ని ఎయిర్‌పోర్టులోనే ఎందుకు నిలువరించారని ప్రశ్నించారు. అప్పటి ఎమ్మెల్యే, ఇవాళ్టి మంత్రి రోజాను జీపులో కుక్కి, ఎక్కడెక్కడో తిప్పి పంపించారని, ఇవేవీ ఇవాళ చంద్రబాబుకు వంత పాడుతున్న కొన్ని పార్టీలకు అప్పుడు కనిపించ లేదా అని కన్నబాబు నిలదీశారు. వీటికి సమాధానం చెప్పాలన్నారు. ఇటీవల కాలంలో వరుసగా రెండు దుర్ఘటనల్లో 11 మందిని బలి తీసుకుని, ఇవాళ జీవో జారీకి కారణం అయిన చంద్రబాబు, ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, పనికిమాలిన రాతలు రాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. గుంటూరు దుర్ఘటనలో ముగ్గురు చనిపోయినా, కనీసం పశ్చాతాపం కూడా వ్యక్తం చేయని చంద్రబాబు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎన్నారైని సమర్థిస్తున్నారని, పదవి, అధికార దాహం తప్ప చంద్రబాబుకు ఇంకేమి అవసరం లేదన్నారు.