Minister Botsa Satyanarayana : ఏపీ కేబినెట్ మంత్రులు రాజీనామాలు చేశారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు మంత్రులంతా రాజీనామాలు చేశారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన వెంటనే కేబినెట్ ను రెండున్నర ఏళ్ల తర్వాత మారుస్తామని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా తమ మంత్రి వర్గంలోని మంత్రులందరితో రాజీనామాలు చేయించారు. అనుభవం రీత్యా వీరిలో ఐదు, ఆరుగురికి మళ్లీ అవకాశం దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన మంత్రులు ఉద్వేగంతో మాట్లాడారు. అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అయితే సీఎం జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా అందుకు సిద్ధంగా ఉన్నామని కొందరు మంత్రులు తెలిపారు. 


పార్టీని, ప్రభుత్వాన్ని కోఆర్డినేట్‌ చేసుకుని పనిచేస్తా : బొత్స


ముఖ్యమంత్రి జగన్ రెండేళ్ల తర్వాత కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ముందే చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ సీఎం జగన్‌ నిర్ణయాన్ని మంత్రులందరూ మనస్ఫూర్తిగా ఆమోదించారన్నారు. సీఎం జగన్‌ తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని కోఆర్డినేట్‌ చేసుకుని పనిచేస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రుల్లో ఎవరిని కొనసాగించాలన్నది సీఎం జగన్‌ ఇష్టమన్నారు. కేబినెట్ ను నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ సీఎంకు ఉందన్నారు. మంత్రిగా ఉన్నా, పార్టీలో ఉన్నా ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే దానిపై సీఎం ప్రణాళిక ఇస్తారన్నారు. పాత కేబినెట్ మాదిరిగానే కొత్త మంత్రి వర్గంలో సామాజిక సమీకరణాలు ఉంటాయని మంత్రి బొత్స అన్నారు. 


వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ మారుస్తారని సీఎం జగన్ ముందే చెప్పారన్నారు. ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎవరికి ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తామని సీఎం జగన్ కు చెప్పామని బొత్స వివరించారు. 


సీఎం జగన్ ఎక్కువ బాధపడ్డారు : కొడాలి నాని 


మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ తాను కూడా అంద‌రి మాదిరిగానే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని ఆయ‌న తెలిపారు. మంత్రి వ‌ర్గ పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో ఐదు, ఆరుగురికి మళ్లీ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుంద‌న్నారు. మంత్రి వర్గంలో కొడాలి నానికి స్థానం ఉంటుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. నాకు నాలుగు కొమ్ములేమీ లేవ‌ని కొడాని నాని అన్నారు. కొత్త కేబినెట్‌లో త‌న‌కు అవ‌కాశాలు త‌క్కువేన‌న్నారు. కేబినెట్ భేటీలో సీఎం ఆదేశాల మేర‌కు మంత్రులందరూ రాజీనామా చేశామ‌న్నారు. ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుంద‌ని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తుంటే సీఎం జ‌గ‌న్ ఎక్కువ‌గా బాధ ప‌డిన‌ట్టుగా క‌నిపించింద‌న్నారు. అనుభవం రీత్యా కొంతమంది మంత్రులను కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారన్నారు. కానీ ఎవరిని కొనసాగిస్తున్నారో చెప్పలేదన్నారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటామన్నారు. కొత్త కేబినెట్‌లో తాను ఉండే అవకాశం తక్కువే అని కొడాలి నాని అన్నారు. సామాజిక సమీకరణల కారణంగా పాత మంత్రుల్లో 5 లేదా 6 మంది కొనసాగే అవకాశం ఉందన్నారు. కొత్త కేబినెట్‌ ద్వారా ప్రజల వద్దకు వెళ్లాలనేది సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్ష అన్నారు.