విభజన అంశాలపై తీవ్ర స్దాయిలో చర్చలు జరుగుతున్నతరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల కలయికపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ కలిస్తే మోస్ట్ వెల్కం అని బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే ఈ అంశం సుప్రీంకోర్టులో ఉందని వ్యాఖ్యానించారు.
మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాల కలయికపై మంత్రి బొత్స మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు మరలా కలసి పోయే విషయంలో వైసీపీని అడిగితే రెండు రాష్ట్రాలు కలిసి పొమ్మని చెప్తుందని అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఇప్పటి వరకు పోరాడుతున్నామని తెలిపారు. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పింది వేదం కాదు చట్టం కాదని బొత్స అన్నారు. చట్ట ప్రకారం ఏపీకి రావాల్సినవి అన్ని రావాలి అని
బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.
బీసీల సభ సక్సెస్- బొత్స
బీసీ మహాసభకు వచ్చిన అందరికి పార్టీ తరపున పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నానని మంత్రి బొత్స తెలిపారు. సీఎం ప్రసంగంలో బీసీలకు ఏమి చేస్తున్నారో చెప్పారని, బీసీలు పార్టీకి వెన్నెముక అని సీఎం స్పష్టం చేశారన్నారు. ఎవరైతే నిరాదరణకు గురయ్యారో వారిని ఆదుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఈ ప్రభుత్వం మనది అనే రీతిలో జయహో బీసీ సభ జరిగిందని అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు మంత్రులపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని బొత్స ఆక్షేపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు ఆయన భుజాలపై చేతులు వేసుకుని తిరిగారా అని ఆయన ప్రశ్నించారు. మాట్లాడే దానికి ఆలోచన ఉండాలని హితవు పలికారు. పనికి మాలిన మాటలు మాట్లాడొద్దని హెచ్చరించారు.
బొత్స కామెంట్స్ కు సజ్జల మద్దతు
విభజన చట్టం అసంబద్ధమని సుప్రీంకోర్టులో కేసు ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానం అని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేస్తుంది వైసీపీనేనన్నారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని, మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే తొలుత స్వాగతించేది వైసీపీనేని తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వినిపిస్తామని, రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలన్నారు. లేదంటే సరిదిద్దాలని కోరుతామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానం అని అన్నారు. రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసులు వేశారని తెలిపారు.
జయహో బీసీ సభ
రాష్ట్రంలో 85 శాతం పైగా ప్రజలు ఎన్నుకున్న బీసీ ప్రతినిధులు జయహో బీసీ సభకు వచ్చారని సజ్జల వ్యాఖ్యానించారు. బీసీ నేతలంతా అందరూ ఒకచోట చేరి జగన్ పై విశ్వాసం చూపించారని తెలిపారు. జయహో బీసీ సభకు 80 వేల పైగా ప్రతినిధులు హాజరయ్యారని వివరించారు. సీఎం మాట్లాడుతుండగా కొందరు భోజనాలకు వెళ్లడం వల్ల కుర్చీలు ఖాళీ అయి ఉండొచ్చని, ఖాళీ కుర్చీలు ఉన్నయంటూ ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని సజ్జల మండిపడ్డారు. దింపుడు కళ్లెం ఆశతో జగన్ పై వ్యతిరేకత ఉన్నట్లు సృష్టిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గడానికి తెదేపానే కారణమన్నారు. ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో బీసీల రిజర్వేషన్ పై కేసు వేసి రిజర్వేషన్లను అడ్డుకున్నారని, రాష్ట్రానికి ప్రథమ శత్రువుగా చంద్రబాబు, తెదేపా ఉందని మండిపడ్డారు. భవిష్యత్తులో ఎస్సీ, మైనార్టీలు పైనా సభలు పెడతామని తెలిపారు.