Pawan Kalyan Prakasam Tour : ఈ నెల 19వ తేదిన ప్రకాశం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారని ఆ పార్టీ పీఏసీ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో కౌలురైతులు ఊహించని విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కౌలు రైతు భరోసా కార్యక్రమంలో జనసేనాని పాల్గొంటారన్నారు. ప్రకాశం జిల్లాలో 76 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను పవన్ పరామర్శిస్తారని తెలిపారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు సాయం అందిస్తారని పేర్కొన్నారు. ఏటుకూరు వద్ద జనసైనికులు పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం పలుకుతారన్నారు. కౌలు రైతులు ఆత్మహత్యల విషయంలో సీఎం జగన్ వైఖరి దారుణంగా ఉందన్నారు.
రైతు భరోసాను స్కామ్ గా మార్చేశారు
అమలాపురం ఘటనపై అమిత్ షాకు లేఖ
గుంటూరు జిల్లాలో 53,000 మంది కౌలు రైతులు ఉన్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. వారానికి ఐదారుగురు కౌలు రైతులు పల్నాడులో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు భరోసాకు కేంద్రం నిధులిస్తుందని వాటిని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. పవన్ కల్యాణ్ చేస్తున్న రైతు భరోసా కార్యక్రమాన్ని సీఎం జగనే స్వయంగా అభినందించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. అగ్ర కులాలకు చెందిన వారని రైతులకు రైతు భరోసా ఇవ్వటం లేదని మనోహర్ ఆరోపించారు. ప్రత్యేక హోదా కాకపోతే ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతే రాజధానే అన్న విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని కోరామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కేంద్రానికి చెప్పామన్నారు. అమలాపురం ఘటనపై అమిత్ షాకు లేఖ రాశామని నాదెండ్ల మనోహర్ వివరించారు. సీఎం జగన్ అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.