Amaravati News :  అమరావతిలో  ఆర్-5 జోన్‌ అంశంపై రైతులు దాఖలు చేసిన  పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.  ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్న న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు  నిరాకరించింది. దీంతో రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చడం చట్ట విరుద్ధమని ఇంతకు ముందు అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి..  రాజధాని అవసరాల కోసమే తాము ఇచ్చిన భూముల్ని ఇతరులకు రాజకీయ కారణాలతో పంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.                   

  
అమరావతిలో గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌లో కీలక నిర్మాణాలు ప్రతిపాదించిన చోట విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేసింది. ఇందు కోసం  సీఆర్‌డీఏ చట్ట సవరణ చేసింది ప్రభుత్ం.  తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో  1134 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.                           


 ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్‌-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది.   ఆర్‌-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇవ్వగా.. దీనిపై  రైతులు హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేయడంతో  ఆర్‌-5 జోన్‌తో రాజధాని భూములను ఇతరులకు కేటాయించేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమం అయినట్లయింది.  రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలకు, చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా వెళ్లటం తగదని, ఈ రకమైన చర్యలు చెల్లవని గతంలో హైకోర్టు అమరావతిపై ఇచ్చిన తీర్పులో పేర్కొంది. కోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది.. చట్టాల్లో మార్పు చేసిందని రైతులు హైకోర్టులో వాదించినా ప్రయోజనం లేకపోయింది.                                    


మే 9 వతేదీన సుప్రీంకోర్టులో అమరావతి అంశంపై విచారణ జరగనుంది.  మే 9న జరిగే విచారణ కేవలం చనిపోయిన ప్రతివాదుల స్థానంలో వారి వారసులను చేర్చడం మాత్రమే జరుగుతుందని న్యాయవాదులు చెబుతున్నారు. ఆర్ 5 జోన్ అంశంపై కూడా రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిజానికి గతంలోనే  రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు హైకోర్టు రైతుల పిటిషన్ తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.