TDP Mahanadu : 40 ఏళ్ల ప్రస్థానం చాటేలా, భవిష్యత్ ప్రయాణాన్ని నిర్దేశించేలా మహానాడు నిర్వహించ‌నున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. మొదటి రోజు ప్రతినిధుల సభకు 12 వేల మందికి ఆహ్వానం పంపుతున్నామ‌ని అన్నారు. రెండో రోజు అదే ప్రాగణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామ‌ని ఆయ‌న వెల్లడించారు. మహానాడు నిర్వహణకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పండుగ మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించాలని నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. 40 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని చెప్పారు. ఇదే సమయంలో భవిష్యత్ ప్రయాణంపై దిశానిర్దేశం చేసేలా కార్యక్రమం ఉండాలని అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న స్పందన చూస్తే ప్రభంజనంలా మహానాడుకు ఉండబోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 


27,28 తేదీల్లో మహానాడు 


ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుపై కమిటీలతో చంద్రబాబు సమీక్షించారు. ఆయా కమిటీల పనితీరుపై సమీక్షించిన చంద్రబాబు పలు సూచనలు చేశారు. మొదటి రోజు జరిగే ప్రతినిధుల సభకు దాదాపు 12 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు పార్టీ నేతలు వివరించారు. రెండో రోజు జరిగే బహిరంగ సభను లక్షల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు.


మహానాడుకు అడ్డంకులు! 


ఒంగోలులో మహానాడు ఏర్పాటు నిర్ణయం తీసుకున్న రోజు నుంచీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొదట ఒంగోలులోని మినీ స్టేడియం ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వం, తరువాత కూడా పలు అడ్డంకులు సృష్టిస్తుందని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. మహానాడుకు వాహనాలు సమకూర్చుకునే విషయంలో రవాణా శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని నేతలు చెప్పారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కావొచ్చు, ప్రభుత్వంలోని వ్యక్తులు కావొచ్చు వీటికి భవిష్యత్ లో మూల్యం చెల్లిస్తారని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదని ఆయన అన్నారు. మహానాడు అనేది పార్టీ పండుగ అయినప్పటికీ ఈ సారి ప్రజలను నుంచి భారీ మద్దతు లభిస్తుందని చంద్రబాబు అన్నారు. మహానాడుకు సౌకర్యాలు, వేదిక నిర్మాణం, భోజన, వసతి  కల్పనలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితికి దర్పణం అని చంద్రబాబు అన్నారు. తన రాయలసీయ పర్యటనకు కూడా పోలీసులు సహకరించలేదని మహానాడుకు కూడా వారు సహకరించే అవకాశం లేదన్నారు. పార్టీ కార్యకర్తల సహకారంతోనే కార్యక్రమం పటిష్టంగా నిర్వహించుకోవాలని సూచించారు. పార్టీ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఇకపోతే మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి 15 తీర్మానాలు ఉండే అవకాశం ఉంది. దీనిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో తీర్మానాల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసే ప‌నిలో ఉంది.