అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేందుకు కొంత సమయం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమయంలో ఈ హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించడం తెలిసిందే. అయితే ప్రతిష్ఠాత్మక హైదరాబాద్‌- అమరావతి- చెన్నై హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగానే నిర్మించనున్నారు. అమరావతికి సమీపం ఉన్న రావెల వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కానుండటంతో బుల్లెట్ రైలు ఎలైన్‌మెంట్‌ కూడా దానికి ఆనుకొని ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. అయితే, విమానాశ్రయానికి ఆనుకొని కారిడార్ నిర్మిస్తే అది అమరావతి నగరంతో పాటు విజయవాడకు కూడా బాగా దూరమవుతుందని అధికారులు గుర్తించారు. దాంతో మొదట అనుకున్నట్లుగానే అమరావతి మీదుగానే ఈ హైస్పీడ్ రైలు కారిడార్ వెళ్లేలా ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (FLS), డీపీఆర్‌ (DPR) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (NHSRCL)కు సూచించింది.

Continues below advertisement

తెలంగాణ నుంచి తమిళనాడు వరకు 760 కి.మీ కారిడార్ఈ హైదరాబాద్‌- అమరావతి- చెన్నై కారిడార్ మొత్తం 760.09 కిలోమీటర్ల పొడవునా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ఇందులో మొత్తం 18 స్టేషన్లను ప్రతిపాదించారు. తెలంగాణ పరిధిలో 180.32 కి.మీ. పొడవు ఉండే ఈ మార్గంలో హైదరాబాద్, శంషాబాద్, భారత్‌ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి వద్ద రైల్వే స్టేషన్లు రానున్నాయి. కారిడార్ సగాని కంటే ఎక్కువ దూరం ఏపీలోనే ఉంటుంది. అత్యధికంగా ఏపీలో 518.54 కి.మీ. మేర ఈ కారిడార్ ఉండనుండగా.. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి ఏపీలో మొదటి స్టేషన్‌ అవుతుంది. ఆ తర్వాత వరుసగా అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి వద్ద స్టేషన్లను నిర్మిస్తారు. ఇక తమిళనాడులో కేవలం 61.23 కి.మీ మార్గంలో తిరువళ్లూరు, చెన్నై ఔటర్‌ రింగ్‌రోడ్‌/ మింజూర్, చెన్నై సెంట్రల్‌ స్టేషన్లు ఉంటాయి.

Continues below advertisement

పలమనేరు అటవీ ప్రాంతంలో సొరంగ మార్గంమరోవైపు, చెన్నై- బెంగళూరు కారిడార్‌లో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం మీదుగా ఈ మార్గం వెళ్లనుంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇక్కడ పలమనేరు అటవీ ప్రాంతంలో 11.8 కి.మీ. మేర సొరంగ మార్గాన్ని (Tunnel) నిర్మించనున్నారు. చెన్నై-బెంగళూరు కారిడార్ మొత్తం 306 కి.మీ. పొడవుండగా, ఇందులో అత్యధికంగా తమిళనాడులో 133 కి.మీ, కర్ణాటకలో 101 కి.మీ, ఏపీలో 72 కి.మీ విస్తరించి ఉండనుంది. 

Also Read: Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

ఈ మార్గంలో ఏపీలోని చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటక పరిధిలోని స్టేషన్లు కలిపి మొత్తం 7 స్టేషన్లు వస్తాయి. ఈ 2 ప్రధాన కారిడార్లను అనుసంధానిస్తూ తిరుపతి- చిత్తూరు మధ్య ప్రత్యేక లింక్ కారిడార్‌ను కూడా చంద్రబాబు సూచనల మేరకు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ పరిశీలిస్తోంది.

ఏపీ మీదుగా వెళ్లనున్న మూడో కారిడార్ అయిన హైదరాబాద్‌- బెంగళూరు హైస్పీడ్‌ కారిడార్ మొత్తం 597 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ మార్గం అత్యధికంగా ఏపీలో 264 కి.మీ., తెలంగాణలో 239 కి.మీ, కర్ణాటకలో 94 కి.మీ. మేర ఉండనుంది. ఈ రూట్‌లో 3రాష్ట్రాల్లో కలిపి మొత్తం 15 స్టేషన్లు వచ్చేలా ప్రతిపాదించారు. తెలంగాణలో హైదరాబాద్, శంషాబాద్ సహా 6 స్టేషన్లు రానుండగా.. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్ వెళ్తుంది. ఈ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులకు సంబంధించిన సర్వేలు త్వరగా పూర్తిచేసి తుది నివేదికలు సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.