Minister Chelluboina Venugopala krishna : కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శెట్టిబలిజ కులస్థుల నుంచి నిరసన వ్యక్తం అయింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్లపై కూర్చొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంపై మంత్రిని శెట్టిబలిజ కులస్థులు నిలదీశారు. మంత్రి వేణుగోపాల కృష్ణను పదవి నుంచి భర్తరఫ్ చేసి నిజమైన శెట్టిబలిజ కులస్థుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల అమలాపురంలో జరిగిన మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకరిల్లి శెట్టిబలిజ జాతి తరఫున రుణపడి ఉంటానని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. శెట్టిబలిజ జాతిని సుబ్బారెడ్డి దగ్గర దిగజార్చారని కోనసీమలో కొందరు నిరసనలు చేశారు. ఇవాళ అమలాపురంలో వైఎస్ఆర్సీపీ సమావేశానికి వచ్చిన మంత్రి వేణు ఎదుట శెట్టిబలిజ సామాజిక వర్గీయులు ఆందోళన చేశారు. 


అసలేం జరిగిందంటే? 


రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేశారు. అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే కూడిపూడి చిట్టాబ్బాయి సంస్మరణ సభలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు విశ్వరూప్, చెల్లిబోయిన వేణుగోపాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సంస్మరణ సభలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్లపై కూర్చుని దణ్ణం పెట్టారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. శెట్టిబలిజలకు అండగా నిలుస్తున్న సీఎం జగన్, సుబ్బారెడ్డికి శెట్టిబలిజల తరఫున కృతజ్ఞతలు అంటూ వేదికపైనే మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేశారు.  


"శెట్టిబలిజలకు సీఎం జగన్ , వైవీ సుబ్బారెడ్డి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకు శెట్టిబలిజ జాతీయుడిగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రాజకీయాల్లో పదవిపోతే పట్టించుకోరు. చిట్టబ్బాయి ఈరోజు మన మధ్య లేకపోయినా శెట్టిబలిజల కోసం ఎంతో కృషి చేశారు. " అని మంత్రి వేణుగోపాల్ అన్నారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి మోకాళ్లపై దణ్ణం పెట్టిన వీడియోను టీడీపీ పోస్టు చేసింది. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు బానిసలుగా ఉంటారని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి వీడియోపై మీమ్స్ తయారు చేస్తున్నారు.