Ali Trying For Vijayawada West YCP Ticket : YSRCP లో చేరిన తెలుగు కమెడియన్ అలీ అసెంబ్లీ సీటు కోసం తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నియోజకవర్గాల స్థాయిలో కాండిడేట్లను భారీగా మారుస్తుండటంతో అలీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ వరుసపెట్టి షాక్‌లు ఇస్తున్న వైఎస్సార్సీపీ మరిన్ని నియోజకవర్గాల్లో కాండిడేట్లను మార్చేందుకు సిద్ధమవుతోంది. మొత్తం మీద 65 స్థానాల్లో సిట్టింగులను మరో చోటకి మార్చడం కానీ.. పూర్తిగా టికెట్లను నిరాకరించడం కానీ చేయాలని ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. చాలా చోట్ల కొత్త ఇన్‌చార్జులను కూడా ప్రకటించేశారు. దీంతో కొత్తగా పార్టీలో చేరిన వారు... ఇప్పటి వరకూ టికెట్ దక్కించుకోని వారంతా తమకు అవకాశం దక్కుతుందేమోనన్న ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అసెంబ్లీ సీటు అడుగుతున్న అలీ
ఇప్పుడు వైఎస్సార్పీపీ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని ఆశిస్తున్న వారిలో అలీ కూడా చేరారు. టాలీవుడ్ కమెడియన్ అలీ 2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. అప్పటి నుంచే ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది. రాజ్యసభ స్థానానికి పరిశీలిస్తున్నారని.. ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని.. వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి అంటూ రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అయితే ఆయన్ను ఈ ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిలో నియమించారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు 2024లో అసెంబ్లీ సీటు కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరిగింది.
గతంలో పలు స్థానాలకు అలీ పేరు పరిశీలన
అలీ తన కుమార్తె వివాహాన్ని గుంటూరుకు చెందిన వ్యక్తితో జరిపించారు. తన కుమార్తె వివాహాన్ని కూడా గుంటూరులో ఘనంగా నిర్వహించడంతో ఆయన గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరిగింది. గుంటూరు ఈస్ట్ సీట్లో ముస్లిం జనాభా ఎక్కువ. చాలా కాలంగా ఆ స్థానాన్ని రెండు పార్టీలు ముస్లింలకు ఇస్తూ వచ్చాయి. అలీ గుంటూరు ఈస్ట్ సీటును ఆశిస్తున్నారని.. ఆయనకు అక్కడ లేదా రాజమండ్రి రూరల్, అర్బన్ స్థానాల్లో ఒకచోట సీటు కేటాయించే అవకాశం ఉందని భావించారు.
తాజాగా విజయవాడకు అలీ పేరు
అయితే ఇప్పుడు మార్పులు చేర్పులలో విజయవాడ పశ్చిమానికి కూడా ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు ఈస్ట్ సీటును రెండు సార్లు అక్కడ నుంచి గెలిచిన ముస్తఫాకు లేదా ఆయన కుమార్తెకు కానీ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని.. విజయవాడ పశ్చిమ స్థానానికి అలీ పేరును పరిశీలిస్తున్నారని వైఎస్సార్పీసీపీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అక్కడ నుంచి మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని ఆయనకు కూడా చెపినట్లు సమాచారం. వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్‌కు మార్చాలన్న యోచన కూడా ఉంది. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ ఓటింగ్ ఎక్కువుగా ఉంది. ఆయన్ను కాదని అక్కడ వెల్లంపల్లికి ఇవ్వడం కూడా అనుమానమే. ఆ లెక్కన వెల్లంపల్లికి పూర్తిగా టికెట్ నిరాకరించే అవకాశం కూడా ఉంది.
ముస్లిం ఓట్లే కీలకం
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం ఓట్ల సంఖ్య ఎక్కువుగా ఉంది. ఇంతకు ముందు ఈ నియోజకవర్గం నుంచి ఎంకే బేగ్ గెలిచి మంత్రయ్యారు. జలీల్ ఖాన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీపీఐ నుంచి నాసర్‌వలీ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం కూడా నాగుల్ మీరాకు రెండు సార్లు టికెట్ ఇచ్చింది. వన్‌టౌన్ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువుగా ఉండటంతో ప్రధాన పార్టీలు ముస్లిం అభ్యర్థికి ప్రాథాన్యం ఇస్తూ వచ్చాయి. వెల్లంపల్లిపై వ్యతిరేకత ఉన్నందున ఈసారికి కొత్త కాండిడేట్‌ను తేవాలని వైసీపీ అనుకుంటోంది. ఈ పరిస్థితిని అలీ వినియోగించుకుంటున్నారు. ముస్లింగా తనకున్న అనుకూలతతో పాటు.. టాలీవుడ్ నటుడిగా తనకున్న ఇమేజ్, ప్రజలందరికీ పరిచయం ఉన్న ఫేస్ కావడం అలీకి కలిసొచ్చే అవకాశం ఉంది. వైసీపీ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలీ ఇప్పటికికే నియోజకవర్గంలోని కొందరు నాయకులకు, పరిచయస్తులకు ఫోన్ చేసి పరిస్థితులపై వాకబు చేసినట్లు తెలుస్తోంది.