Chandrababu House : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న  లింగమనేని గెస్ట్ హౌస్‌ను జప్తు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.  లింగమనేని రమేష్ కు నోటీస్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పిటిషన్‌ను అనుమతించడంతో ఇంటిని జప్తు చేసినట్లేనని భావిస్తున్నారు. ఇక లింగమనేని ఇంటిని అమ్మడం లేదా తనఖా పెట్టడం వంటివి చేయకూడదని న్యాయవర్గాలు చెబుతున్నాయి. కరకట్ట వద్ద గల లింగమనేని ఇంటి జప్తునకు అనుమతి కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై   విజయవాడ ఏసీబీ కోర్టులో  కేసు విచారణాధికారి ఏఎస్పీ కోర్టుకు హాజరై వివరాలు సమర్పించారు.  ఇరువైపుల వాదనలు విన్న కోర్టు సీఐడీ పిటిషను అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. 


లింగమనేని గెస్ట్ హౌస్ లోనే  చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారు.   ఈ గెస్ట్ హౌస్ ను ఏపీ ప్రభుత్వం అటాచ్  చేస్తూ సీఐడీకి అనుమతి ఇచ్చింది.  ఈ గెస్ట్ హౌస్ ను  జప్తు చేసేందుకు అనుమతివ్వాలని  ఏపీ సీఐడీ   ఏసీబీ కోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది.   రాజధాని  భూ సేకరణ నుండి  మినహాయించినందునే లింగమనేని గెస్ట్ హౌస్ నపు  చంద్రబాబుకు కేటాయించారని  ఏపీ సీఐడీ కోర్టులో వాదించింది.   సీఆర్‌డీఏ అలైన్ మెంట్,  మాస్టర్ ప్లాన్ విషయంలో అవకతవకలు  జరిగాయని సీఐడీ  న్యాయవాది పేర్కొన్నారు.  క్విడ్  ప్రో కో లో భాగంగానే  లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబుకు కేటాయించారని  సీఐడీ వాదించింది. అయితే  ఈ విషయమై  క్విడ్ ప్రో కో జరిగిందని  ఆధారాలను సీఐడీ  అందించలేదని  లింగమనేని రమేష్ బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 


సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.  సీఎంగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ పదవుల దుర్వినియోగానికి, క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలు జరిగాయని, దానికి బదులుగా చంద్రబాబు కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ పొందారని ప్రభుత్వం అభియోగం మోపింది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను ఉల్లంఘించినట్టు ప్రభుత్వం ఆరోపిస్తోంది. అసలు అసలు ఇన్నర్ రింగ్ రోడ్ పనులే ప్రారంభం కానప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని లింగమనేని తరపు లాయర్లు వాదించారు.                                          


తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని ప్రభుత్వం అభియోగం చెబుతోంది.   వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి.. ప్రతిఫలంగా గెస్ట్ హౌస్ తీసుకున్నారని ఇది క్విడ్ ప్రో  కో కిందకు వస్తుందని సీఐడీ..కేసు నమోదు చేసి అటాచ్ మెంట్ కోసం ప్రభుత్వానికి లేఖలు రాసింది.ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి తెచ్చుకుంది.