ACB court grants two day SIT custody to Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అయి జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని రెండు రోజుల కస్టడీకి తీసుకునేందుకు సిట్ కు .. ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మిథున్ రెడ్డిని గతంలో ఓ సారి విచారణకు పిలిచి ప్రశ్నించారు. అరెస్టు చేసిన తర్వాత కస్టడీకి తీసుకోలేదు. ఇప్పుడు ఆయనను కస్టడీకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది.
మిథున్ రెడ్డిని ప్రధాన కుట్రదారుగా చెబుతున్న సిట్
లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట్ ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి ప్రధాన కుట్రదారుడిగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చెబుతోంది. మిథున్ రెడ్డి లిక్కర్ పాలసీ మార్పులు, షెల్ కంపెనీల ద్వారా లంచాల సేకరణ వంటి కీలక పాత్రలు పోషించారని సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం 2019లో లిక్కర్ పాలసీని మార్చి, రాష్ట్రంలోని 3,500 లిక్కర్ షాపులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బదిలీ చేసింది. ఈ పాలసీలో మాన్యువల్ పేమెంట్ సిస్టమ్‌కు మార్చడం, లంచాలు సేకరించడం, షెల్ కంపెనీల ద్వారా డబ్బు రూటింగ్ చేయడం వంటి అక్రమాలు జరిగాయని సిట్ ఆరోపణలు చేసింది. ఈ స్కామ్‌లో మిథున్ రెడ్డి ఏ-4 గా ఉన్నారు.
డబ్బులను హవాలా ద్వారా రూటింగ్ చేశారని సిట్ అనుమానం
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీఎస్‌బీసీఎల్ పాలసీలను మాన్యువల్ మోడ్‌కు మార్చడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ చెబుతోంది. ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై సిస్టమ్‌ను మాన్యువల్‌కు మార్చి, లంచాలు చెల్లించే కంపెనీలకు మాత్రమే సప్లై అనుమతులు ఇచ్చారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా పని చేసిన ఏ-3 డి. సత్య ప్రసాద్‌కు నాన్-క్యాడర్ ఐఏఎస్ ప్రమోషన్ ఇస్తానని హామీ ఇచ్చి, ఏపీఎస్‌బీసీఎల్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. సత్య ప్రసాద్ లిక్కర్ సప్లైని కంట్రోల్ చేసి, లంచాలు చెల్లించే కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చారని సిట్ తెలిపిది.
రెండు రోజుల సిట్ కస్టడీ తర్వాత సిట్ కీలక నిర్ణయాలు
డిస్టిలరీలు , సప్లయర్ల నుంచి నెలకు 50-60 కోట్ల రూపాయల లంచాలు సేకరించారని... ఈ డబ్బును షెల్ కంపెనీలు, హవాలా ట్రాన్సాక్షన్‌ల ద్వారా మళ్లించారని సిట్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణపై తాజాగా ఈడీ.. దేశవ్యాప్తంగా ఉన్న మనీలాండరర్స్ పై దృష్టి పెట్టి సోదాలు నిర్వహిస్తోంది. ఈ కేసులో రెండు రోజుల పాటు మిథున్ రెడ్డిని ప్రశ్నించిన తర్వాత సిట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.