AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడడంతో రోడ్డుమార్గం ద్వారా నార్పల నుంచి పుట్టపర్తికి చేరుకున్నారు. బుధవారం జగనన్న వసతి దీవెన బటన్ నొక్కేందుకు అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి అక్కడ్నుంచి హెలికాప్టర్ లో నార్పలకు చేరుకున్నారు. ఉదయం ఆకాశం మేఘావృతం గా ఉన్నప్పటికీ హెలికాప్టర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్ అయింది. అయితే ఒంటి గంటకు బహిరంగ సభ ముగిసింది. తిరుగు సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్ పని చేయకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా బత్తలపల్లి ధర్మవరం మీదుగా పుట్టపర్తికి ప్రత్యేక కాన్వాయ్ లో వెళ్లారు. పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.
అంతకు ముందు విద్యా దీవెన నిధులు జమ చేసేందుకు బటన్ నొక్కిన తర్వాత జగన్ మాట్లాడారు. విద్యార్థులందరూ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల లాగా నిలవాలని ఆకాంక్షించారు. జర్మనీ, మెల్ బోర్న్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని... కోర్సు చదివేటప్పుడే తప్పనిసరి చేశామన్నారు. జగనన్న విదేశీ విద్య పథకాన్ని కూడా తీసుకొచ్చామన్నారు. ఇచ్చిన మాట మేరకు సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా సీఎం వైయస్ జగన్ జగనన్న వసతి దీవెన అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్‌లో బటన్ నొక్కి జమ చేస్తున్నామ న్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుందన్నారు.
గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయడమేగాక 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు తమ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు అన్నారు. వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం క్రమం తప్పకుండా తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తాము అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు.