AP Card Registrations :   ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం ఆంధ్రప్రదేశ్ లో మారుతోంది.  సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం అమలు  కానుంది.   రిజిస్ట్రేషన్ల శాఖలో ఉన్న CARD 1.0 స్తానంలో. CARD 2.0 ను తీసుకొస్తోంది ప్రభుత్వం.  కొత్త విధానంతో రిజిస్ట్రేషన్ విధానం సులువు అవుతుంది. అయితే అనేక రకాల అనుమానాలు నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. 



నూతన విధానం లో రిజిస్ట్రేషన్ ఎలా అంటే ? 


కొత్త కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రూపకల్పన ను ప్రభుత్వం చేపట్టింది.  ఆన్ లైన్ లోనే దస్తావేజులు తయారీ, స్లాట్ బుక్ చేసుకునే  వెసులుబాటు కూడ కల్పించారు.  రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద ఎక్కువ సేపు వేచి ఉండే పరిస్థితి కి చెక్ పెట్టటంతో పాటుగా, అక్రమాకుల ఆస్కారం లేకుండా నూతన విధానం ఉంటుందని చెబుతున్నారు.  వినియగదారులు సొంతంగా ఆన్లైన్ లో దస్తావేజులోని వివరాలు నమోదు చేసుకుని ఫీజు చెల్లించే అవకాశం  కూడా కల్పించారు.  రిజిస్ట్రేషన్ పూర్తయిన 20 నిమిషాల్లోనే  దస్తావేజులు జారీ కానున్నాయి.  ఈ నెల 15 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది, ఏపీ  సర్కారు. దీని వలన రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకత ఏర్పడుతుందని చెబుతున్నారు. 
 
ఆరంభంలో చిక్కులు ఉంటాయన్న ప్రభుత్వం 


ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ సదుపాయం అమలులోకి రావటానికి కొంత సాంకేతిక సమస్య ఎదురు అవుతుందని ప్రభుత్వం ముందుగానే స్పష్టం చేసింది. నూతన వర్షన్ కావటంతో రిజిస్ట్రేషన్ ను చేసుకునేందుకు ఇచ్చిన ఆప్షన్ లు పై కొంత అవగాహన ఉండాలని కూడ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపున నూతన వర్షన్ అమలు పై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని దీని వలన ఆరంభం లో కొంత వరకు ఇబ్బందులు ఉంటాయని, అయితే ఎట్టి పరిస్దితుల్లో సెప్టెంబర్ 15 నుండి పూర్తి స్దాయిలో అన్ని జిల్లాల్లో కూడ అమలులోకి తెస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


డేటా చోరీ ప్రమాదం 


ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు చేసే విదానం అమలులోకి రావటం పై అనేక  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా వ్యక్తిగత సమాచారం అంతా బహిర్గతం అవుతుందని, ఆస్తులకు సంబంధించిన పత్రాలు సైతం బహిరంగంగా అందరికి అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉందనే ప్రచారం కూడ జరిగింది. దీని పై సర్కార్ కూడ క్లారిటి ఇచ్చింది. వ్యక్తిగత సమాచారం, డేటా చోరీలు జరిగే అవకాశం లేకుండానే అప్ డేట్ వర్షన్ లో పూర్తి భద్రత, పారదర్శక సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


డాక్యుమెంట్ రైటర్ల నిరసన 


ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ల విధానం అమలు చేయటం పై డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు ఇప్పటికే పెన్ డౌన్ చేసి తమ నిరసన తెలుపుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్లు కూడ చాలా తక్కువగా జరుగుతున్నాయి. దశాబ్దాలుగా తాము ఇదే పని చేసుకొని జీవనం సాగిస్తున్నామని, అయితే సర్కార్ తన జీవనోపాధిని దెబ్బ తీసే విధంగా అప్ డేట్ వర్షన్ తో సచివాలయాల్లో కూడ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవటం దారుణమని పేర్కొన్నారు.