లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కోహ్లీ సేన అద్భుత విజయం చేసింది. డ్రాగా ముగుస్తుందో, ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందేమో అనుకున్నారు అభిమానులు. కానీ, భారత పేసర్లు అనూహ్యంగా పుంజుకుని మాయ చేయడంతో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం దక్కించుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.   






181/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో టీమ్‌ఇండియా సోమవారం చివరి రోజు ఆటను ప్రారంభించగా.. మహ్మద్‌ షమి (56 నాటౌట్; 70 బంతుల్లో 6x4, 1x6), జస్ప్రిత్‌ బుమ్రా (34 నాటౌట్‌; 64 బంతుల్లో 3x4) బ్యాటింగ్‌లోనూ అద్భుతం చేశారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 89 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన ఇచ్చిన 272 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమయ్యారు. సిరాజ్‌ 4/32, బుమ్రా 3/33, ఇషాంత్ 2/13 రాణించడంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పట్టారు. కెప్టెన్‌ జోరూట్‌(33; 60 బంతుల్లో 5x4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో బట్లర్‌(25; 96 బంతుల్లో 3x4), రాబిన్‌సన్‌(9; 35 బంతుల్లో) వికెట్‌ కాపాడుకుంటూ పరుగులు సాధించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి జోరుకు బుమ్రా, సిరాజ్‌ అడ్డుకట్ట వేశారు.






షమి, బుమ్రా.. ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీలుచిక్కినప్పుడల్లా పరుగులు తీస్తూ టీమిండియా స్కోరు బోర్డును కదిలించారు.  ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 298/8 పరుగుల వద్ద కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఓవర్‌ నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. టీమ్‌ఇండియా పేసర్లు సరైన సమయాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే టీమిండియాకి చిరస్మరణీయమైన విజయం అందించారు. కేఎల్ రాహుల్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 






భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌: 364 ఆలౌట్‌; రాహుల్‌ 129, అండర్సన్‌ 5 వికెట్లు.


ఇంగ్లాండ్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌: 391 ఆలౌట్‌; జో రూట్‌ 180 నాటౌట్‌, సిరాజ్‌ 4 వికెట్లు.


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 298/8 డిక్లేర్‌; అజింక్య రహానె 61, మార్క్‌వుడ్‌ 3 వికెట్లు.


ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 120 ఆలౌట్‌; జో రూట్‌ 33, సిరాజ్‌ 4 వికెట్లు.


లార్డ్స్ టెస్టులో విజయం సాధించిన కోహ్లీ సేన పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ట్విటర్ వేదికగా మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు.